పింఛన్లు పెంచకుండా కొత్త పింఛన్ల పేరుతో కాంగ్రెస్ నాటకాలు!
మూడేళ్లయినా హామీ అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి: లకావత్ గిరిబాబు
వైరా నియోజకవర్గం: ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే కొత్త పింఛన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు తదితర వర్గాలకు పింఛన్లు అందించి అండగా నిలిచారని గుర్తుచేశారు. దివ్యాంగుల పింఛన్ రూ.4 వేల నుంచి రూ.6 వేలకు, ఇతర పింఛన్లు రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
అర్హులైన వృద్ధులు, బీడీ కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కొత్త పింఛన్ల ప్రకటనలు చేయడం కంటే గతంలో ఇచ్చిన హామీలను ముందుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పెంచుతామని ప్రకటించిన పింఛన్ మొత్తాలను వెంటనే పెంచడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేయాలని లకావత్ గిరిబాబు ప్రభుత్వాన్ని కోరారు.









