బాధితులకు న్యాయం.. నేరస్తులకు చట్టప్రకారం శిక్షలే లక్ష్యం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

0
4

నేరాల దర్యాప్తులో నాణ్యత, పక్కా ఆధారాల సేకరణ, న్యాయస్థానాల్లో సమర్థవంతమైన వాదనలతో నేరస్తులకు శిక్షలు పడేలా రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు విశేష కృషి చేశారు. 2026 సంవత్సరంలో కమిషనరేట్ పరిధిలో మొత్తం 76 కాంటెస్టెడ్ కన్విక్షన్ కేసుల్లో 112 మంది నిందితులకు న్యాయస్థానాలు శిక్షలు విధించాయని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు.

ఈ సందర్భంగా కేసుల దర్యాప్తు, సాక్ష్యాధారాల సమర్పణలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సీపీ అభినందించారు.

శిక్షల వివరాలు ఇలా ఉన్నాయి:

8 కేసుల్లో 8 మందికి జీవిత ఖైదుతో పాటు రూ.55,000 జరిమానా విధించారు.

2 కేసుల్లో 5 మందికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.21,000 జరిమానా విధించారు.

ఒక కేసులో ఒకరికి 12 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించారు.

9 కేసుల్లో 10 మందికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.90,000 జరిమానా విధించారు.

ఒక కేసులో ఒకరికి 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధించారు.

5 కేసుల్లో 7 మందికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.84,000 జరిమానా విధించారు.

మరో 39 కేసుల్లో 49 మందికి నాలుగేళ్లలోపు జైలు శిక్షతో పాటు జరిమానాలు విధించారు.

11 కేసుల్లో 31 మందికి రూ.1,30,300 జరిమానా మాత్రమే విధించారు.

ఈ కేసులన్నింటిలో కలిపి న్యాయస్థానాలు మొత్తం రూ.7,44,500 జరిమానా విధించాయని సీపీ తెలిపారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, నేరం చేసిన వ్యక్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేయడం పోలీసుల ప్రధాన బాధ్యతని స్పష్టం చేశారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు పూర్తి చేయడం, శాస్త్రీయ ఆధారాల సేకరణ, సాక్ష్యాలను పటిష్టంగా రూపొందించడం, న్యాయస్థానాల్లో వాటిని సమర్థవంతంగా ప్రవేశపెట్టడం వరకు ప్రతి దశలో అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

ఒక కేసులో నేరం నిరూపితమై నిందితుడికి శిక్ష పడినప్పుడు బాధితులకు న్యాయం జరగడమే కాకుండా, ప్రజల్లో పోలీసు, న్యాయవ్యవస్థలపై విశ్వాసం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోలేరనే బలమైన సందేశం సమాజానికి అందుతుందని తెలిపారు.

ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై నేరాలు, హత్యలు, పోక్సోతో పాటు ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు చేపట్టి, ప్రతి అంశాన్ని పకడ్బందీగా న్యాయస్థానాల్లో నిరూపించాలని అధికారులకు సూచించారు.

పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. కీలక కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేసిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

ఇదే స్ఫూర్తితో మరింత అంకితభావంతో పనిచేస్తూ బాధితులకు న్యాయం జరిగేలా, పోలీసు వ్యవస్థపై ప్రజల నమ్మకం నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు.