గంజాయి సాగు.. విక్రయాల గుట్టురట్టు.. బీటెక్ విద్యార్థి అరెస్ట్ |

0
4

● బీటెక్ విద్యార్థి అరెస్ట్.. రెండు గంజాయి మొక్కలు స్వాధీనం

● నాలుగు గ్రాముల ఎండు గంజాయి పట్టివేత.. మొత్తం విలువ రూ.5 వేలు

● సరఫరా మూలాలు, ఇతర నిందితులపై పోలీసుల దర్యాప్తు

అల్వాల్,నవంబర్21:మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై మల్కాజిగిరి పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచడంతో పాటు ఎండు గంజాయిని కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై 22 ఏళ్ల బీటెక్ విద్యార్థిని ఎస్‌ఓటీ మల్కాజిగిరి జోన్ టీమ్‌-1 బృందం, జవహర్‌నగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.

● రెండు గంజాయి మొక్కలు స్వాధీనం

విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఓటీ బృందం, జవహర్‌నగర్ పోలీసులు సంయుక్తంగా సంతోషీనగర్, బాలాజీనగర్ ప్రాంతంలో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా సుమారు రెండు అడుగుల ఎత్తున్న రెండు సజీవ గంజాయి మొక్కలు, నాలుగు గ్రాముల ఎండు గంజాయి లభించాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.5 వేలుగా పోలీసులు అంచనా వేశారు.

● సరఫరా నెట్‌వర్క్‌పై ఆరా

నిందితుడు గంజాయి ఎక్కడి నుంచి సేకరిస్తున్నాడు? సాగుకు అవసరమైన విత్తనాలు, ఇతర సామగ్రిని ఎలా సమకూర్చుకున్నాడు? ఈ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి సరఫరా మూలాలను గుర్తించడంతో పాటు ఇతర వ్యక్తుల ప్రమేయాన్ని వెలికితీసేందుకు విచారణ కొనసాగుతోంది.

● మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం

డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, వాటికి దూరంగా ఉండాలని మల్కాజిగిరి పోలీసులు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై నిరంతర నిఘా కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కడైనా డ్రగ్స్‌కు సంబంధించిన కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజలు అందించే సమాచారం ప్రాణాలను కాపాడటంతో పాటు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

#Sidhumaroju

Alwal