● తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబాటు
● వస్తువులన్నీ చిందరవందర.. నగదు, ఆభరణాలు అపహరణకు గురికాని వైనం
● హైకోర్టు న్యాయవాది ఇంటితో పాటు మరో రెండు ఇళ్లలో ఘటన
● మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం
అల్వాల్, నవంబర్ 22: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జనప్రియ బంగ్లాస్లో దొంగలు హల్చల్ చేశారు. ఒకే కాలనీలోని మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు. ఇళ్లలోకి చొరబడి వస్తువులను చిందరవందర చేసినప్పటికీ నగదు, విలువైన వస్తువులు అపహరణకు గురికాకపోవడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై హైకోర్టు న్యాయవాది మొమిన్ మహమ్మద్ రఫీక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదివారం ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో తన వాచ్మెన్ ద్వారా ఇంటిలో చోరీ యత్నం జరిగిన విషయం తెలుసుకున్నట్లు రఫీక్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి జనప్రియ బంగ్లాస్లోని తన డూప్లెక్స్ ఇంటికి చేరుకున్నారు. పరిశీలించగా ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉండటంతో పాటు ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నట్లు గుర్తించారు. దొంగలు ఇంట్లోకి ప్రవేశించి చోరీకి యత్నించినప్పటికీ నగదు, విలువైన వస్తువులు ఏవీ అపహరణకు గురికాలేదని తెలిపారు.
● మరో రెండు ఇళ్లలోనూ ఇదే తరహాలో..
అదే కాలనీలో నివసించే దుర్గాప్రసాద్ (60), సరోజీ దాస్ (62) ఇళ్లలోనూ దొంగలు చొరబడినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ఆ ఇళ్ల తాళాలను కూడా పగులగొట్టి లోపల వస్తువులను చిందరవందర చేశారు. అయితే ఈ రెండు ఇళ్లలోనూ నగదు, విలువైన వస్తువులు చోరీకి గురికాలేదని పేర్కొన్నారు.
● కేసు నమోదు.. పోలీసుల దర్యాప్తు
ఒకే కాలనీలో వరుసగా మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలపై నవంబర్ 22న ఉదయం సుమారు 11 గంటలకు మొమిన్ మహమ్మద్ రఫీక్ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మూడు ఇళ్లలో చోరీకి యత్నించిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
#Sidhumaroju
Alwal










