హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ భీమా పథకానికి సంబంధించి నాచారం, ఉప్పల్ ప్రాంతాల్లో ప్రజలు తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల వరకు బీమా రక్షణ కల్పించనున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు నమోదు ప్రక్రియపై ఆసక్తి చూపిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, అవసరమైన గుర్తింపు పత్రాలు సమర్పిస్తూ నమోదు కేంద్రాల వద్ద తమ వివరాలను నమోదు చేయించుకుంటున్నారు.
ముఖ్యంగా నాచారం, హబ్సిగూడ, మల్లాపూర్, ఉప్పల్ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో రద్దీ కనిపిస్తోంది. కుటుంబ వివరాల నమోదు కోసం ప్రజలు క్యూలైన్లలో వేచి ఉంటున్నారు.
ప్రభుత్వ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత అందుతుందనే ఆశతో ప్రజలు నమోదు ప్రక్రియలో పాల్గొంటున్నారు. అయితే నమోదు కేంద్రాల వద్ద తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.










