● 22 గ్రాముల డ్రగ్, ఆరు సెల్ఫోన్లు, నగదు స్వాధీనం
● ఇద్దరు అరెస్ట్.. ముగ్గురిపై డ్రగ్ వినియోగం కేసులు
అల్వాల్, నవంబర్ 26: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మెథాంఫెటమైన్ డ్రగ్ అక్రమ కార్యకలాపాలను సూరారం పోలీసులు, ఎస్ఓటీ కుత్బుల్లాపూర్ బృందం సంయుక్తంగా ఛేదించారు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్‌తో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22 గ్రాముల మెథాంఫెటమైన్, ఆరు సెల్ఫోన్లు, రూ.4 వేల నగదు, ఒక ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సూరారం ఎస్హెచ్ఓ బాలరాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. చీమర్ల చైతన్య బాలాజీ (21), ఇల్ల మోహన్ (29), కనపర్తి సంతోష్ మోహన్ కుమార్ (27), కొప్పుల లాల్ కిషన్ శ్రీరామ్ (33), శివరాత్రి కాలీదాస్ (33) ఈ కేసులో పట్టుబడ్డారు. వీరిలో బెంగళూరులో నివసించే విద్యార్థి చైతన్య బాలాజీ స్వస్థలం అచ్చంపేట. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతడు జీడిమెట్లలోని ఎస్.ఆర్. నాయక్ నగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఇల్ల మోహన్‌కు మెథాంఫెటమైన్ సరఫరా చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
డ్రగ్ సరఫరా, విక్రయ కార్యకలాపాలకు పాల్పడిన చైతన్య బాలాజీ, ఇల్ల మోహన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ముగ్గురు డ్రగ్ వినియోగించినట్లు విచారణలో తేలడంతో వారిపై కేసులు నమోదు చేశారు. సాయిబాబా నగర్‌కు చెందిన ఉద్యోగాన్వేషణలో ఉన్న కనపర్తి సంతోష్ మోహన్ కుమార్, జీడిమెట్ల ఎన్.ఎల్.బి. నగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి కొప్పుల లాల్ కిషన్ శ్రీరామ్, షాపూర్ నగర్ కలావతి నగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ శివరాత్రి కాలీదాస్పై చట్టపరమైన చర్యలు చేపట్టారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూరారం పోలీసులు సూచించారు. డ్రగ్స్ సరఫరా, విక్రయం, వినియోగానికి పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
#Sidhumaroju
Alwal









