ఎమ్మెల్యే చొరవతో చిన్నరాయుని (చెరువు) కుంట అభివృద్ధికి ముందడుగు.|

0
0

● బాధిత ప్లాట్ల యజమానుల ప్రతిపాదనపై చర్చ

● స్థలాలు అప్పగించేందుకు యజమానుల అంగీకారం

● హైడ్రా, ఇరిగేషన్ శాఖల క్షేత్రస్థాయి పరిశీలన

అల్వాల్, 26: అల్వాల్‌లోని చిన్నరాయుని (చెరువు) కుంట అభివృద్ధికి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఎఫ్‌టీఎల్ పరిధిలోని స్థలాల సమస్యతో పాటు కుంట అభివృద్ధికి సంబంధించి బాధితులు చేసిన ప్రతిపాదనలపై ఆయన సమీక్షా సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో తమ స్థలాలను పనుల కోసం అప్పగించేందుకు యజమానులు అంగీకరించడం కీలక పరిణామంగా మారింది.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిన్నరాయుని (చెరువు) కుంటతో పాటు కొత్త చెరువు, బండ చెరువుల అభివృద్ధి అంశాలు చర్చకు వచ్చాయి. బాధితులు తమ సమస్యలు, ప్రతిపాదనలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిపై సానుకూలంగా చర్చించారు. మూడు చెరువుల ప్రస్తుత పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని హైడ్రా, ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

సర్వే నంబర్ 248లో ఉన్న చిన్నరాయుని (చెరువు) కుంట మొత్తం విస్తీర్ణం 17 ఎకరాల 25 గుంటలు. ఇందులో చాకలి ఘాట్‌కు రెండు ఎకరాలు, వీకర్ సెక్షన్‌కు మరో రెండు ఎకరాలు కేటాయించగా, ప్రస్తుతం 13 ఎకరాల 25 గుంటల విస్తీర్ణం కుంటగా మిగిలింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో స్థలాలు ఉండటంతో వాటిని వినియోగించుకోలేక యజమానులు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు చెరువు పనులకు మార్గం సుగమం చేసేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం లేదా టీడీఆర్ పొందే విధంగా తమ స్థలాలను అప్పగించేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు హైడ్రా లేక్ డిపార్ట్‌మెంట్, ఇరిగేషన్ శాఖ అధికారులు చిన్నరాయుని (చెరువు) కుంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు, ఆవేదనను తెలుసుకున్నారు. ఈ అంశంపై తమ పరిధిలో అవసరమైన ప్రయత్నాలు చేస్తామని భరోసా ఇచ్చారు. చిన్నరాయుని (చెరువు) కుంటను పరిరక్షించడంతో పాటు భవిష్యత్తులో ఆక్రమణలకు అవకాశం లేకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో హైడ్రా లేక్ డిపార్ట్‌మెంట్ అధికారులు యూనస్, డిజైనర్ సురేష్ రెడ్డి, ఇంజనీర్ శ్రీకాంత్, ఇరిగేషన్ శాఖ ఏఈ ఆంజనేయులు, మణికంఠ, మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, రామచంద్ర ఇందిరాల, శ్రీధర్ గౌడ్, సురేష్, మధుసూదన్ రెడ్డి, విజయ్ శేఖర్, విజయ్ రెడ్డి, అరవింద్, లోకేష్, సతీష్, గౌరీ శంకర్, కాలనీవాసులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal