ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో రూ.12.75 లక్షల వస్తువుల మాయం.|

0
0

● ఒక ఉద్యోగి అరెస్ట్.. రూ.లక్ష విలువైన వస్తువులు స్వాధీనం

● మరో ముగ్గురి పాత్రపై పోలీసుల ఆరా

అల్వాల్,నవంబర్26:సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీనగర్‌లో ఉన్న ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో రూ.12.75 లక్షల విలువైన వస్తువులు మాయమైన ఘటన కలకలం రేపింది. సంస్థ నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో భారీ మొత్తంలో వస్తువులు కనిపించకపోవడంతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో సూరారం పోలీసులు ఒక ఉద్యోగిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి సుమారు రూ.లక్ష విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురి పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సూరారం ఎస్‌హెచ్‌ఓ బాలరాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఇన్‌స్టాకార్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎం.ఏ. రెహమాన్ (66) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీనగర్‌లోని ఫ్లిప్‌కార్ట్ హబ్‌ నుంచి కొంతకాలంగా వస్తువులు మాయమవుతున్నట్లు సంస్థ అంతర్గత ఆడిట్‌లో గుర్తించారు. సుమారు రూ.12.75 లక్షల విలువైన వస్తువులు మిస్సింగ్ అయినట్లు నిర్ధారించుకుని, సంస్థ స్థాయిలో జరిపిన విచారణలో నలుగురిని అనుమానితులుగా గుర్తించారు.

వారిలో మహమ్మద్ జియావుల్ (28)ను అదుపులోకి తీసుకుని విచారించగా, డెలివరీ విధులు నిర్వహించే సమయంలో సంస్థకు తెలియకుండా హబ్‌లోని వస్తువులను బయటకు తీసుకెళ్లి వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. సూరారంలోని వీఐపీ ఫంక్షన్ హాల్ సమీపంలో నివసించే జియావుల్ స్వస్థలం బీహార్‌లోని సహర్సా జిల్లా. అతడి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, పవర్ బ్యాంకులు, ఒక వాచ్, దుస్తులతో పాటు సుమారు రూ.లక్ష విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఈ వ్యవహారంలో అనుమానితులుగా ఉన్న మన్నె రమేష్, గుండ్ల బాలసూర్య, అమర్రాజుల సంజయ్‌ల పాత్రపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు విధి నిర్వహణలో నిజాయితీగా ఉండాలని, యాజమాన్యానికి చెందిన వస్తువులను అక్రమంగా తరలించడం, దుర్వినియోగం చేయడం చట్టరీత్యా నేరమని సూరారం పోలీసులు హెచ్చరించారు.

#Sidhumaroju

Alwal