- 96 పంచాయతీల్లో 65 చోట్ల కూటమి జయకేతనం.
- మందస, వజ్రపుకొత్తూరులో టీడీపీ హవా.. పలాసలో వైసీపీ పైచేయి.
పలాస: పలాస నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని మొత్తం 96 పంచాయతీలకు గాను కూటమి 65 స్థానాలను కైవసం చేసుకోగా, వైసీపీ 29 స్థానాలతో సరిపెట్టుకుంది. మరో రెండు పంచాయతీల్లో స్వతంత్ర, టీడీపీ రెబెల్ అభ్యర్థులు విజయం సాధించారు.
మండలాల వారీగా ఫలితాలను పరిశీలిస్తే వజ్రపుకొత్తూరు మండలంలో కూటమి అత్యధిక స్థానాలను దక్కించుకుంది. మొత్తం 37 పంచాయతీల్లో టీడీపీ 30, జనసేన రెండు స్థానాల్లో విజయం సాధించాయి. వైసీపీ మూడు పంచాయతీలకే పరిమితం కాగా, ఉండ్రుకుడియాలో స్వతంత్ర అభ్యర్థి, చిన్నవంకలో టీడీపీ రెబెల్ అభ్యర్థి విజయం సాధించారు.
మందస మండలంలోని 41 పంచాయతీల్లో టీడీపీ 25 స్థానాలను కైవసం చేసుకుని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వైసీపీ 16 స్థానాల్లో విజయం సాధించింది. ఈ మండలంలో జనసేనకు సర్పంచ్ స్థానం దక్కలేదు.
ఇక పలాస మండలంలో మాత్రం వైసీపీ ఆధిక్యం కనబరిచింది. మొత్తం 18 పంచాయతీలకు గాను వైసీపీ 10 స్థానాలను గెలుచుకోగా, టీడీపీ ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. దీంతో మూడు మండలాల్లో పలాస ఒక్కటే వైసీపీకి అనుకూలంగా నిలిచింది.
మొత్తం ఫలితాల్లో టీడీపీ 63, జనసేన రెండు స్థానాలు సాధించడంతో కూటమి బలం 65కు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో కూటమికి లభించిన ఈ ఆధిక్యం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పలాసలో వైసీపీ తన పట్టును నిలబెట్టుకోవడం స్థానిక రాజకీయ సమీకరణాల్లో ఆసక్తికరంగా మారింది.










