జైపూర్ మండలంలోని టేకుమట్ల, శెట్టిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ క్షేత్రస్థాయిలో సందర్శించి, ధాన్యం సేకరణ, నిల్వలు, రవాణా, నాణ్యత ప్రమాణాలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. తేమ శాతం పరీక్షలు, ధాన్యం నాణ్యత నిర్ధారణ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
కొనుగోలు చేసిన ధాన్యం కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోకుండా సంబంధిత రైస్ మిల్లులకు వేగంగా తరలించాలని, కొత్తగా ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు రవాణా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నీడ, తాగునీరు, గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, డ్రయ్యర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, కొనుగోళ్లలో పారదర్శకత పాటిస్తూ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.









