కొత్తగూడ, ఏప్రిల్ 17:మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ మండల కేంద్రంలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న హనుమాన్ ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే పలు కార్యక్రమాలకు సంబంధించి హనుమాన్ స్వాములు స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఏప్రిల్ 21న హనుమాన్ ఉత్సవ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరగనుంది. అలాగే ఏప్రిల్ 22న మండలకేంద్రంలో పురవీధుల్లో హనుమాన్ నగర సంకీర్తన నిర్వహించనున్నారు. భక్తుల కోలాహలం, భజన కీర్తనలతో ఈ కార్యక్రమం కనువిందుగా సాగనుంది.ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ, హనుమాన్ సేవా సమితి ప్రతినిధులు మరియు హనుమాన్ మాలధారులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సైని కలిసి కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.
”భక్తిభావంతో నిర్వహించే ఈ వేడుకల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని, శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని” నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో గంగాపురపు బిక్షపతి, కల్లూరి కృష్ణ చారి, నాగబేల్లి శోభన్ గట్ల శ్రీను, గూడూరు దుర్గాప్రసాద్, ప్రశాంత్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.










