చీరాల మండలం తోటవారిపాలెంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్లలో ‘శక్తి టీం’ పోలీసులు సమయస్ఫూర్తి చాటుకున్నారు. జనసందోహంలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను సురక్షితంగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చి పోలీసుల ఉదారతను చాటుకున్నారు.
తిరునాళ్ల సందడిలో ఇద్దరు చిన్నారులు తమ తల్లిదండ్రుల నుంచి వేరుపడి భయాందోళనతో ఏడుస్తూ కనిపించారు. అక్కడ విధుల్లో ఉన్న శక్తి టీం కానిస్టేబుల్ కె. సుబ్బారావు వెంటనే ఆ పిల్లలను చేరదీసి, వారిని ఓదార్చారు. చిన్నారుల నుంచి చాకచక్యంగా వివరాలు సేకరించిన ఆయన, వారి తల్లిదండ్రుల ఆచూకీ కనుగొన్నారు. అనంతరం తల్లిదండ్రులను పిలిపించి చిన్నారులను వారికి అప్పగించారు.
తమ పిల్లలు క్షేమంగా తిరిగి దొరకడంతో తల్లిదండ్రులు ఆనంద బాష్పాలతో కానిస్టేబుల్ సుబ్బారావుకు మరియు శక్తి టీంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తిరునాళ్ల వంటి రద్దీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉంటూ సేవలు అందించడంపై భక్తులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










