హైదరాబాద్ :రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
తన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఈ దశలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా న్యాయమూర్తులు, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కోర్టు జోక్యం చేసుకున్న గత తీర్పులు ఏమైనా ఉంటే చూపించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులను కోరారు. అలాగే నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన వివాదాల విషయంలో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం సరైన మార్గమని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాల్లో చట్టం నిర్దేశించిన విధానాలను అనుసరించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసేందుకు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్‌ను పరిశీలన సందర్భంగా రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఒక పెండింగ్ అంశానికి సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడించలేదన్న అభ్యంతరాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదని, నామినేషన్ తిరస్కరణ చట్టబద్ధం కాదని వాదిస్తోంది.
సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో మీనాక్షి నటరాజన్‌కు తక్షణ ఉపశమనం లభించలేదు. దీంతో ఆమె ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.
రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
#Sidhumaroju










