కృష్ణలంక సాయి కృష్ణ అదృశ్యం కేసు.. డీజీపీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
18-06-2026 Thu 06:09
Andhra
Krishnalanka Sai Krishna disappearance case CM Chandrababu key orders to DGP
సాయికృష్ణ అదృశ్యం కేసులో కృష్ణలంక సీఐ సస్పెండ్
ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తు జరపాలని సూచన
పోలీసుల అదుపు తర్వాతే సాయికృష్ణ కనపడలేదంటున్న కుటుంబం
జూన్ 29 లోగా హాజరుపరచాలని హైకోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేకెత్తించిన విజయవాడ కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారితో ఉన్నతస్థాయిలో నిష్పక్షపాత విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
బుధవారం సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ అదృశ్యం కేసుపై లోతుగా చర్చించి, ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణపై గతంలో కొన్ని నేరారోపణలు ఉన్నాయి. అయితే, మే 9న మార్కాపురంలో కృష్ణలంక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని, అప్పటి నుంచి ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, జూన్ 29లోగా సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.
ఈ కేసు నేపథ్యంలో ఇప్పటికే సీఐ నాగరాజును వీఆర్‌కు బదిలీ చేయగా, తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.










