ఉచిత బస్సు ప్రయాణం పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీని నియంత్రించడం సిబ్బందికి సవాలుగా మారింది. బస్సుల్లో సీట్ల కోసం, ఎక్కే క్రమంలో తలెత్తుతున్న వివాదాలతో కొందరు మహిళా ప్రయాణికులు డ్రైవర్లు, కండక్టర్లపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డ డిపో పరిధిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రద్దీ కారణంగా కొందరు మహిళలు ఆర్టీసీ సిబ్బందిపై తీవ్ర వాగ్వాదానికి దిగి దాడులు చేశారు.
ఈ దాడులకు నిరసనగా అవనిగడ్డ ఆర్టీసీ డిపో సిబ్బంది బస్సు సర్వీసులను నిలిపివేశారు. తమకు తగిన భద్రత కల్పించాలని, లేకపోతే విధులు నిర్వహించడం కష్టమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.









