ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా జొన్నగిరిలో జియో మైసూర్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కేవలం ‘అన్నపూర్ణ’ మాత్రమే కాదని, అపారమైన ఖనిజ సంపద కలిగిన ‘రత్నగర్భ’ అని ఆయన అభివర్ణించారు. స్థానిక సహజ వనరులను సద్వినియోగం చేసుకుని రాయలసీమను ‘రతనాల సీమ’గా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, జొన్నగిరిని ‘స్వర్ణగిరి మోడల్ విలేజ్’గా తీర్చిదిద్ది జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జూలై 3న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపనతో పాటు కర్నూలులో డ్రోన్ సిటీ, అనంతపురంలో ఫైటర్ జెట్ల ప్రాజెక్టు వంటి భారీ పరిశ్రమలతో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.









