Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన కమ్యూనిటీ పర్పస్ (సీపీ) స్థలాలపై జరుగుతున్న ఆక్రమణలను వెంటనే అరికట్టాలని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని 21 ప్రభుత్వ లేఅవుట్లలో ఉన్న కమ్యూనిటీ పర్పస్ స్థలాలపై వెంటనే సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు.
ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తక్షణమే తొలగించి, ఆ స్థలాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వ్యక్తులపై, అలాగే ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పునీత్ కుమార్ మాట్లాడుతూ, “ప్రజల సామాజిక అవసరాల కోసం కేటాయించిన కమ్యూనిటీ పర్పస్ స్థలాలను ఆక్రమించడం ప్రజా ద్రోహంతో సమానం. అధికారులు నిద్రమత్తు వీడి ప్రభుత్వ భూములను పరిరక్షించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలి. లేనిపక్షంలో బహుజన యువసేన ఆధ్వర్యంలో దశలవారీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం” అని హెచ్చరించారు.










