మల్లంపేట: ఇటీవల సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనమైన మల్లంపేటలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కేవలం 150 చదరపు గజాల స్థలాల్లోనే ఎలాంటి సెట్‌బ్యాక్‌లు పాటించకుండా జీ+3 భవనాలు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా, కొందరు అధికారులు మామూళ్లు తీసుకుని అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
ముఖ్యంగా ఇరుకైన గల్లీల్లోనూ ఎలాంటి అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా భవనాలు నిర్మించడంతో భవిష్యత్తులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల ద్వారా కొందరు బిల్డర్లు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.





