దుండిగల్-గండిమైసమ్మ మండలం మల్లంపేట మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైనా ఇక్కడ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కొందరు బిల్డర్లు సెట్బ్యాక్లు వదలకుండా, కనీస పార్కింగ్ సదుపాయం లేకుండానే జీ+2, జీ+3 భవనాలను నిర్మిస్తున్నారు. దీంతో పార్కింగ్ స్థలం లేక వాహనాలను ఇరుకైన రోడ్లపైనే నిలుపుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్లు వెళ్లేందుకు కూడా దారి లేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువవడంతోనే నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ నిబంధనల ప్రకారమే అనుమతులు ఇవ్వాలని, ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.










