ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్):తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్ విమర్శించారు. ఆసిఫాబాద్‌లో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నెలకు ₹4,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని 17 రకాల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ రెండున్నరేళ్ల పాలనలో కేవలం 60,000 ఉద్యోగాలకే పరిమితమై, లక్షలాది ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.రాష్ట్రంలో లక్షలాది మంది యువత డీఎస్సీ (DSC), గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని రమేష్ పేర్కొన్నారు. పోలీస్ శాఖలో 21,000 ఖాళీలు ఉన్నట్లు డీజీపీ లెక్కలు చెబితే, ప్రభుత్వం కేవలం 7,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమన్నారు. ఆసిఫాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతాల యువత కోసం తక్షణమే అన్ని ఖాళీలకు పూర్తిస్థాయి నోటిఫికేషన్లు ఇవ్వాలని, లేనిపక్షంలో నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని కోటా రమేష్ హెచ్చరించారు.










