సీసీసీ నస్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ

0
3

మంచిర్యాల: రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాష్‌తో కలిసి పరిశీలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆటో రాంగ్‌రూట్‌లో వచ్చి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సీపీ తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులను పరిశీలించి, డివైడర్‌లోని ఖాళీని మూసివేయడంతో పాటు రహదారిపై అవసరమైన మార్పులు చేపట్టేందుకు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపిస్తామని వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు కలెక్టర్‌తో సమన్వయం చేస్తున్నామని తెలిపారు.