ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు

0
1

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమావేశాలకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. మరోవైపు సభ ప్రారంభానికి ముందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం సభ ప్రారంభం కాగా, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో కొనసాగుతున్న నిర్మాణ పనులపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సభలో కీలక వివరాలను వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో మొత్తం 119 పనులను ప్రతిపాదించగా, 103 పనులకు ల్యాండ్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేశామని, ప్రస్తుతం 97 పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, నాబార్డ్ ద్వారా మొత్తం రూ.41,187.7 కోట్లు టై-అప్ కాగా, ఇప్పటివరకు రూ.12,737.13 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు.

అలాగే ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన 30,173 మంది రైతులకు 71,293 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. రైతులకు కౌలు కింద ఇప్పటివరకు రూ.2,248.03 కోట్లు చెల్లించినట్లు వివరించారు.