మల్కాజ్‌గిరి అభివృద్ధిపై ఎమ్మెల్యే భేటీ.|

0
1

● పెండింగ్‌ పనులు, మౌలిక వసతులపై విస్తృత చర్చ

● 22-ఏ జాబితాలోని నివాస ప్రాంతాల సమస్యలపై ప్రత్యేక ప్రస్తావన

● రహదారులు, రిజర్వాయర్, ఫైర్‌స్టేషన్‌ సహా పలు అంశాలపై వినతిపత్రాలు

మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 25: మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, IASను జిల్లా కలెక్టరేట్‌లో కలిశారు.

నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన అనంతరం వినతిపత్రాలను సమర్పించారు.

ఏఓసీ పరిధిలో అదనపు రోడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టడంతో పాటు అసంపూర్తిగా నిలిచిపోయిన కమ్యూనిటీ హాళ్లను పూర్తి చేయాలని ఎమ్మెల్యే వినతిపత్రంలో పేర్కొన్నారు. మచ్చ బొల్లారంలో గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ ఏర్పాటుకు సుచిత్ర–బోయిన్‌పల్లి ప్రధాన రహదారిలోని డైరీ ఫార్మ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఆర్మీ భూమిలో ఒక ఎకరం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అల్వాల్ గ్రామకంఠం స్థలంలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను తొలగించి, భూమిని పరిరక్షిస్తూ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని సూచించారు.

అల్వాల్‌లోని బాలసదన్ సఖి సెంటర్ సమీపంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు అంశాన్ని కూడా అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతాలకు సంబంధించిన భూములను అర్బన్ సీలింగ్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డు ఆస్తులు తదితర కారణాలతో 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే వివరించారు.

యాప్రాల్ సర్వే నంబర్ 144లోని నివాస ప్రాంతం, శ్రీనగర్ కాలనీలోని పేదల ఇళ్లు, గౌతమ్ నగర్, మల్లికార్జున్ నగర్,బలరాం నగర్, దేవీనగర్, మాతృపురి కాలనీ, సీతారాం నగర్, ఆదర్శ్ నగర్ తదితర ప్రాంతాలను ఆ జాబితా నుంచి తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

టెలికాం కాలనీలోని సర్వే నంబర్ 278లో గల ఎకరం స్థలాన్ని రెగ్యులరైజ్ చేసి ప్రజా అవసరాలకు వినియోగంలోకి తీసుకురావాలని, మచ్చ బొల్లారం డివిజన్‌లోని తోళ్ల కార్ఖానా సర్వే నంబర్ 380లోని స్థలాన్ని పరిరక్షించాలని పేర్కొన్నారు.

రామకృష్ణాపురం ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా నివాసాలు కోల్పోతున్న బాధితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని, గౌతమ్ నగర్ డివిజన్‌లో 5 ఎంఎల్‌డీ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూమికి సంబంధించిన అడ్డంకులను తొలగించి పనులు ముందుకు సాగేలా చూడాలని ఎమ్మెల్యే ప్రతిపాదించారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన టీచర్ల నియామకంతో పాటు, కౌకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణానికి ఆర్మీ, ప్రభుత్వ భూముల సరిహద్దులను నిర్ధారించి మార్గం సుగమం చేయాలని వివరించారు.

కౌకూర్ దర్గా నుంచి సింగాయిపల్లి బిట్స్ పిలానీ వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని, కౌకూర్ చెరువు నుంచి యాప్రాల్ చెరువుకు వెళ్లే నీటి ప్రవాహ నాలాను ఆక్రమణల నుంచి రక్షించాలని కోరారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం ద్వారా అర్హులైన పేద మహిళలకు కుట్టు మిషన్లు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, ప్రభుత్వ సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలతో నిరంతరం సమన్వయం చేస్తూ పనులను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే సమర్పించిన వినతిపత్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, IAS సంబంధిత శాఖల అధికారులతో చర్చించి, సాధ్యమైనంత త్వరగా తగిన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు.

#Sidhumaroju

Alwal