● ఇద్దరి అరెస్ట్.. రూ.7.60 లక్షల విలువైన 19 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం
● మూడు కమిషనరేట్ల పరిధిలో 16 చోరీ కేసులతో సంబంధం
● మల్కాజిగిరి పరిధిలో అల్వాల్ సహా పలు స్టేషన్లలో కేసులు
ఆల్వాల్, సెప్టెంబర్ 5: స్టడీ హాళ్లలో విద్యార్థులు విరామ సమయంలో బయటకు వెళ్లడాన్ని అవకాశంగా చేసుకుని ల్యాప్‌టాప్‌లు అపహరిస్తున్న వ్యక్తితో పాటు, వాటిని కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఖైరతాబాద్ జోన్ నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.
సెప్టెంబర్ 3న సంగిశెట్టి వినీత్ (29), వెమునూరి శ్రీనివాస్ (29)ను అదుపులోకి తీసుకున్న అధికారులు వారి వద్ద నుంచి రూ.7.60 లక్షల విలువైన 19 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఇద్దరికి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో నమోదైన 16 చోరీ కేసులతో సంబంధం ఉన్నట్లు తేలింది.
సంగిశెట్టి వినీత్ విద్యార్థి మాదిరిగా స్టడీ హాళ్లలోకి ప్రవేశించి, అక్కడ చదువుకునే వారు భోజనం లేదా ఇతర అవసరాల కోసం బయటకు వెళ్లిన సమయంలో వారి పరికరాలను ఎత్తుకెళ్లేవాడు.
అనంతరం వాటిని వెమునూరి శ్రీనివాస్‌కు విక్రయించేవాడు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల విక్రయంతో పాటు మరమ్మతుల వ్యాపారం నిర్వహిస్తున్న శ్రీనివాస్ వాటిని స్వీకరించేవాడని విచారణలో వెల్లడైంది.
నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేఎంఐటీ కళాశాల సమీపంలోని స్టడీ హాళ్లు, తెలుగు అకాడమీ ప్రాంతాలు అతడి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నట్లు తేలింది.
ఆగస్టు 16న బ్రైట్ మైండ్స్ స్టడీ హాల్‌లో చదువుకుంటున్న వి. సురేష్ తన పరికరాన్ని క్యాబిన్‌లో ఉంచి రాత్రి 7 గంటల సమయంలో హాస్టల్‌కు భోజనం కోసం వెళ్లాడు. సుమారు గంట తర్వాత తిరిగి వచ్చేసరికి అది కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన బృందం వినీత్ కదలికలను గుర్తించింది.
విచారణను విస్తరించగా నారాయణగూడ, సైఫాబాద్, మలక్‌పేట, అబిడ్స్, ఎస్‌ఆర్‌నగర్, నల్లకుంట పోలీస్‌స్టేషన్లతో పాటు మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి, కుషాయిగూడ, ఉప్పల్, ఎల్‌బీనగర్, అల్వాల్ స్టేషన్లలోనూ వీరిపై కేసులు ఉన్నట్లు బయటపడింది.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లోనూ ఇదే తరహా కేసు నమోదై ఉన్నట్లు గుర్తించారు.
పార్సిగుట్ట సమీపంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏడు డెల్, ఆరు హెచ్‌పీ, మూడు లెనోవో, రెండు ఏసర్, ఒక ఆసుస్ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.7.60 లక్షలుగా అంచనా వేశారు.
కేసు దర్యాప్తు ఖైరతాబాద్ జోన్ డీసీపీ కె. శిల్పవల్లి, ఐపీఎస్ పర్యవేక్షణలో సాగింది. నారాయణగూడ ఎస్‌హెచ్‌ఓ ఎం. సాయిదేశ్వర్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ బి. అభిలాష్, డిటెక్టివ్ ఎస్‌ఐ సీహెచ్. నాగరాజుతో పాటు క్రైమ్ సిబ్బంది కీలకంగా వ్యవహరించారు.
స్టడీ హాళ్లు, లైబ్రరీల్లో చదువుకునే విద్యార్థులు విరామ సమయంలో తమ విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా వదిలి వెళ్లవద్దని పోలీసులు సూచించారు.
ఈ వ్యవహారంలో మరిన్ని చోరీలు వెలుగులోకి వస్తాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
#Sidhumaroju
Alwal










