ఏపీలో కొలువుల జాతర.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.

0
2

 

అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ తో పాటు రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ నిబంధనల మార్పు

ఇప్పటికే ఏపీపీఎస్సీ, పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఏపీ ఫైర్ సర్వీసెస్ (అగ్నిమాపక) శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB) ప్రాథమిక ప్రకటనను జారీ చేసింది. అయితే ఈసారి నియామక విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో కేవలం ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌ (PMT) ఆధారంగా మాత్రమే ఈ ఎంపికలు జరగగా, ప్రస్తుత నోటిఫికేషన్‌లో ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌ (PET)తో పాటు రాత పరీక్షను కూడా తప్పనిసరి చేస్తూ నిబంధనలు సవరించారు.

 

 

దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయోపరిమితి మరియు రాతపరీక్షల విధానంతో కూడిన సమగ్ర నోటిఫికేషన్ షెడ్యూల్‌ను ఎస్‌ఎల్‌పీఆర్‌బీ త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఏపీపీఎస్సీ ద్వారా 892 ఖాళీలకు, పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడగా… తాజాగా అగ్నిమాపక శాఖలో మరిన్ని పోస్టులు తోడవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.