హైకోర్టులో పిల్ వేస్తా! – బీడీ రావు

0
1

70 లక్షలు దొరికాయనేది పచ్చి అబద్ధం – దుష్ప్రచారంపై హైకోర్టును ఆశ్రయిస్తా: బీడీ రావు

ఓటమి భయంతోనే కూటమి నేతలు తనపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని పలాస వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బమ్మిడి దుర్యోధన రావు (బీడీ రావు) తీవ్రంగా ఖండించారు. తన ఇంట్లో, తన సన్నిహితుడి ఇంట్లో రూ.70 లక్షలు దొరికాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడో ఎవరి వద్దో కొద్దిపాటి డబ్బు దొరికితే, దాన్ని తనకు ఆపాదించి ఓటర్లలో గందరగోళం సృష్టించి ఓట్లు పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.

 

ఈ దుష్ప్రచారం చేసిన వారిపై పూర్తి ఆధారాలతో పలాస డీఎస్పీకి ఫిర్యాదు చేసి రసీదు తీసుకున్నామని, చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారని తెలిపారు. అంతటితో ఆగకుండా పలాస మండల ఆర్వో, జిల్లా ఎస్పీ, కలెక్టర్, జిల్లా రిటర్నింగ్ అధికారి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌లకు కూడా ఫిర్యాదు ప్రతులు పంపుతున్నట్లు వెల్లడించారు.

 

వారం పది రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే శిరీష, జిల్లా ఎస్పీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారని బీడీ రావు గుర్తు చేశారు. ఇప్పుడు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినందున బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఈ వ్యవహారంపై రేపే హైకోర్టులో పిల్ (PIL) దాఖలు చేస్తానని ప్రకటించారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. పలాస మండల ప్రజలకు తన నిజాయితీ ఏమిటో బాగా తెలుసని, ప్రత్యర్థులకు తన అసలైన రాజకీయం ఈరోజే మొదలైందని వ్యాఖ్యానించారు.