61, 62, 63 వార్డుల్లో లబ్ధిదారులకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఆస్తి పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ గణబాబు గారు

0
1

“పేదలకు పట్టాభిషేకం – మీ ఇల్లు మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 61, 62, 63 వార్డులకు చెందిన లబ్ధిదారులకు శాశ్వత రిజిస్టర్డ్ ఆస్తి పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. 63వ వార్డు క్రాంతినగర్ లో, 62వ వార్డు ఏఎస్ఆర్ (ASR) కాలనీ లో, అలాగే 61వ వార్డులోని మరిడిమాంబ కళ్యాణమండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యాలయంలో విశాఖపట్నం పశ్చిమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ముఖ్య అతిథిగా పాల్గొని, మొత్తం 616 మంది లబ్ధిదారులకు అధికారిక రిజిస్టర్డ్ ఆస్తి పత్రాలను స్వయంగా అందజేశారు.

 ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు గారు మాట్లాడుతూ, గతంలో ఇచ్చిన పట్టాల మాదిరిగా కాకుండా, కూటమి ప్రభుత్వం అధికారిక సబ్-రిజిస్ట్రార్ ముద్రతో సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్టర్డ్ కన్వేయెన్స్ డీడ్స్ అందిస్తోందని తెలిపారు. పేద ప్రజలు దశాబ్దాలుగా నివాసముంటున్న స్థలాలపై చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ పత్రాల ద్వారా బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొంది పిల్లల ఉన్నత చదువులకు, కుటుంబ ఆర్థిక పురోగతికి వినియోగించుకోవచ్చని, ఈ ఆస్తులు భావితరాలకు పటిష్టమైన ఆర్థిక భరోసాగా నిలుస్తాయని వివరించారు.

 ​ఈ కార్యక్రమంలో ములగాడ తాసిల్దార్ రామలక్ష్మి, రెవెన్యూ అధికారులు, స్థానిక వార్డుల ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.