● అనుమతులు లేకుండా కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్ల నిల్వ
● గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేసి దాదాపు రెట్టింపు ధరకు విక్రయం
● సివిల్ సప్లైస్, పోలీసుల దాడి.. సిలిండర్లు స్వాధీనం
అల్వాల్, సెప్టెంబర్ 26: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని పెద్ద పారిశ్రామిక వాడగా ఉన్న కాల్లకల్ గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తూ LPG సిలిండర్లను అక్రమంగా ఫిల్లింగ్ చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
దీనిపై జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు, మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలోని పోలీసు సిబ్బంది సంయుక్తంగా దాడి నిర్వహించారు.
దాడిలో 200కు పైగా LPG సిలిండర్లు బయటపడ్డాయి. కమర్షియల్, డొమెస్టిక్ విభాగాలకు చెందిన వివిధ కంపెనీల సిలిండర్లు ఇందులో ఉన్నాయి.
ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్‌కు గ్యాస్‌ను అక్రమంగా మార్చి నింపడంతో పాటు, వీటిని దాదాపు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
రాజస్థాన్ రాష్ట్రం పోలీ జిల్లా కాశీఫార్మా గ్రామానికి చెందిన ఘనశ్యామ్ కుమావత్ (30) ప్రస్తుతం కాల్లకల్‌లో నివాసం ఉంటూ ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కాల్లకల్ పెద్ద పారిశ్రామిక వాడగా ఉండటంతో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు, కార్మికులు నివసిస్తున్నారు. హోటళ్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు కూడా విస్తృతంగా ఉన్నాయి.
ఇలాంటి ప్రాంతంలో 200కు పైగా LPG సిలిండర్లను ఒకేచోట నిల్వ ఉంచి అక్రమంగా ఫిల్లింగ్ చేయడం భద్రతాపరంగా ఆందోళన కలిగించే అంశంగా మారింది.
LPG అత్యంత దహనశీల పదార్థం కావడంతో ఇంత పెద్ద సంఖ్యలో సిలిండర్లు ఉన్న ప్రదేశంలో గ్యాస్ లీకేజీ లేదా అగ్నిప్రమాదం వంటి అనుకోని ఘటన చోటుచేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
దీంతో ఇంత పెద్ద మొత్తంలో నిల్వను సంబంధిత విభాగాలు ఇన్ని రోజులు ఎలా గుర్తించలేకపోయాయి? పర్యవేక్షణ ఏ మేరకు సాగిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జిల్లా సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదు మేరకు మనోహరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
200కు పైగా LPG సిలిండర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, అక్రమ ఫిల్లింగ్ వెనుక ఉన్న వ్యవహారం, సిలిండర్ల సరఫరా మార్గాలు, ఇతరుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు.
ఈ వ్యవహారం వెనుక ఉన్న రాకెట్‌ను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
#Sidhumaroju
Alwal









