బుచ్చంపేట పిహెచ్సి పరిధిలో ఏజెన్సీ గ్రామాలలో దోమతెరల పంపిణీ

0
3

బుచ్చంపేట మండలంలోని బుచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఏజెన్సీ ప్రాంత గ్రామాలైన పెద్దపేట, ఎం. పెదపేట, సింగరాజుపేట, చటర్జీపురం గ్రామాల్లో బుధవారం దోమతెరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.వైద్యాధికారి ఎల్. శివప్రసాద్ తన సిబ్బందితో కలిసి గ్రామాల్లో పర్యటించి ప్రతి ఇంటికి దోమతెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో దోమల ద్వారా వ్యాపించే మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పగలు, రాత్రి నిద్రించే సమయంలో తప్పనిసరిగా దోమతెరలు వాడాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోమతెరల వాడకమే సులభమైన, సురక్షితమైన మార్గమని వివరించారు.ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ సిహెచ్. వి. రమణ, హెచ్.వి. సన్యాసమ్మ, ఏఎన్ఎం సత్యవేణి, హెల్త్ అసిస్టెంట్ రాధాకృష్ణతో పాటు పలువురు ఆశా కార్యకర్తలు పాల్గొని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.