“అనంత్ అంబానీ… మీరు ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ” అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అనంత్ అంబానీ ప్రసంగం అనంతరం, ముఖ్యమంత్రి స్వయంగా ఆయన వద్దకు వెళ్లి అభినందించి, ఆప్యాయంగా హత్తుకోవడం సభలో ఉన్నవారిని ఆకట్టుకుంది.
అంతకుముందు, సభలో ప్రసంగించిన అనంత్ అంబానీ ఆంధ్రప్రదేశ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనను ఆంధ్రప్రదేశ్ బిడ్డగా భావించాలని, రాష్ట్ర అభివృద్ధికి తాను ఏం చేయాలో మార్గనిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఆయన ప్రసంగానికి సభికుల నుంచి విశేష స్పందన లభించింది. అనంత్ ప్రసంగం ముగియగానే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఆయనను అభినందించారు.
అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అనంత్ అంబానీ మాటలపై స్పందించారు. “అనంత్ అంబానీని మన రాష్ట్ర ముద్దుబిడ్డగా భావిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో రిలయన్స్ సంస్థ మరింతగా భాగస్వామి కావాలి” అని వేదికపై నుంచి ప్రకటించారు.









