రోలుగుంట:ఈ గ్రామం ఎక్కడో మారుమూల అడవుల్లో లేదు. మన నర్సీపట్నానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. గూగుల్ పటంలో కూడా కనిపించని ఆ గ్రామం పేరు కొమ్మర్ల.అనకాపల్లి జిల్లాకు అల్లూరి జిల్లాకు మధ్య కొండపై ఉన్న ఈ గ్రామంలో రోడ్డు లేదు, నీరు లేదు. అమాయక గిరిజన పిల్లలు సిమెంటు సంచులతో కట్టిన చిన్న గుడిసెలోనే చదువుకుంటున్నారు. నేల మీద కూర్చుని, చిరిగిన పలకలతో వారి చదువు సాగుతోంది. చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.ఈ పిల్లల కష్టాన్ని చూసిన రత్నంపేట జనసైనికుడు ముక్క సాయి ఇన్స్టాగ్రాములో చిన్న వీడియో చేశాడు.ఆ వీడియో చూసి కాకినాడ చేయూత ట్రస్టు అధినేత రవి వెంటనే స్పందించాడు. పిల్లలకు తాత్కాలికంగా షెడ్డుతో బడి కట్టిస్తామని చెప్పాడు.వెంటనే రత్నంపేట జనసేన యువత అధ్యక్షుడు పెద్దాడ నాగేష్, మణి బాబు మరియు జనసైనికులు చేయూత బృందంతో కలిసి ఆ కొండ ఎక్కి గ్రామానికి వెళ్లారు. పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, సంచులు పంచారు. రెండు సంవత్సరాల పాటు చదువుకు కావాల్సినవన్నీ ఉచితంగా ఇస్తామని మాట ఇచ్చారు. మీకు మేము ఉన్నామని భరోసా ఇచ్చారు.ఈ బడి గత ప్రభుత్వంలోనే మంజూరు అయింది. కానీ కట్టలేదు. అందుకే ఇప్పటికీ గుడిసెలోనే బడి నడుస్తోంది.మనకు ఇంత దగ్గరలో ఇలాంటి గ్రామం ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడానికి వీరు వీడియో ద్వారా ప్రభుత్వానికి విన్నపం పంపించారు.కళ్లకు కనిపించని గ్రామాన్ని వెతికి పట్టుకుని ఆదుకున్న రత్నంపేట జనసేన బృందాన్ని చూసి స్థానికులు కన్నీళ్లతో కృతజ్ఞతలు చెబుతున్నారు.









