పాక్ గూఢచర్య నెట్‌వర్క్‌ను ఛేదించిన ఏపీ ఇంటెలిజెన్స్.. ఇద్దరి అరెస్ట్.

0
5

 

ఆపరేషన్ ఫైర్‌వాల్-2026తో పాక్ గూఢచర్య ముఠా గుట్టురట్టు

విశాఖ నేవీ స్థావరాల సమాచారమే లక్ష్యంగా కుట్ర

13 మంది నేవీ సిబ్బంది సహా 18 మందిపై నిఘా

విశాఖ, కోయంబత్తూర్‌లలో ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు

డబ్బు కోసం రహస్య సమాచారం చేరవేసినట్లు ఆరోపణలు

భారత నావికాదళానికి చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న పాకిస్థాన్ గూఢచర్య నెట్‌వర్క్‌ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఛేదించింది. “ఆపరేషన్ ఫైర్‌వాల్-2026” పేరుతో చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా విశాఖపట్నంలోని కీలక రక్షణ స్థావరాల సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

 

ఈ కేసులో మొత్తం 18 మంది అనుమానితులపై నిఘా పెట్టినట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. వీరిలో 13 మంది నేవీ సిబ్బంది కూడా ఉండటం సంచలనం సృష్టిస్తోంది. 12 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోదాలు జరిపాయి. నిందితులు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ చానెళ్ల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు ఆధారాలు సేకరించారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను విశ్లేషిస్తున్నారు.