శ్రీశైలం దేవీ శరన్నవరాత్రులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు ఆహ్వానం.

0
3

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో జరగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లకు దేవస్థానం ఆహ్వానం పలికింది. ఈ మేరకు దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఇవాళ ఉండవల్లిలో వారిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

 

ఈ నెల అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారు తొమ్మిది రోజుల పాటు నవదుర్గ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. అంతేకాకుండా, ప్రతిరోజూ నవావరణ పూజలు, చండీయాగం, రుద్రయాగం, కుంకుమార్చనలు, చతుర్వేద పారాయణలు, సువాసిని-కుమారీ పూజలు వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ రాత్రి వేళల్లో స్వామి అమ్మవార్లకు వివిధ వాహనాలపై గ్రామోత్సవం కన్నుల పండువగా జరుపుతారు.