భారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలం గ్రామాలను చెత్త రహితంగా తీర్చిదిద్దడంతో పాటు మహిళల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో అశోక్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో బాబురావు తెలిపారు. బుధవారం నల్లచెరువు మండలం పి.కొత్తపల్లి పంచాయతీలో స్వచ్ఛ రథం కార్యక్రమం నిర్వహించారు.ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. తడి, పొడి చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి అందించాలని సూచించారు. దసరా సందర్భంగా 10 కిలోలకు పైగా చెత్త అందించే ప్రతి కుటుంబానికి కూపన్ ఇస్తామని, దసరా రోజున లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు ఇంటికి అవసరమైన గృహోపకరణాలను బహుమతులుగా అందజేస్తామని వెల్లడించారు.పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని స్వచ్ఛ గ్రామాల నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ, పంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.










