పవన్ కల్యాణ్ పేరిట నకిలీ ఎక్స్ ఖాతా సృష్టించిన నిందితుడు
హైదరాబాద్లో నిందితుడు రాకేశ్ ను అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు
టీడీపీ-జనసేన మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్రగా అనుమానం
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాడన్న ఆరోపణలపై నల్లపాడు పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెంకు చెందిన తీర్థాల నాగ వెంకట దుర్గ రాకేశ్ ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని, అనంతరం గుంటూరుకు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం, నిందితుడు రాకేశ్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరుతో ఒక నకిలీ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను సృష్టించాడు. ఈ ఖాతా ద్వారా నారా లోకేశ్ ప్రతిష్టకు భంగం కలిగించేలా కల్పిత పోస్టులు, వీడియోలను సర్క్యులేట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికార కూటమిలోని తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకే ఈ దుష్ప్రచారం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.










