• షటిల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్ గణబాబు
• విశాఖను రాష్ట్ర క్రీడా రాజధానిగా తీర్చిదిద్దడమే ధ్యేయం
విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 60వ వార్డు, శ్రీహరిపురం ఎంఐజీ కాలనీ (వుడా కాలనీ)లో జీవీఎంసీ సాధారణ నిధులు రూ. 3.85 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన అత్యాధునిక “ఇండోర్ ట్రైనింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్” ను విశాఖపట్నం ఎంపీ శ్రీ మతుకుమిల్లి శ్రీభరత్ గారు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రభుత్వ విప్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు శనివారం ఘనంగా ప్రారంభించారు.
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం, నూతనంగా నిర్మించిన వుడెన్ కోర్టులో ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్ గణబాబు స్వయంగా షటిల్ బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను, స్థానికులను ఉత్సాహపరిచారు. అనంతరం చిన్నారుల కరాటే, బాక్సింగ్ ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. శాశ్వత పరిష్కారంతో క్రీడా వేదిక: విశాఖ ఎంపీ శ్రీ మతుకుమిల్లి శ్రీభరత్
• సమస్య పరిష్కారం – మౌలిక వసతి: గతంలో పాడుబడిన భవనంతో అసాంఘిక శక్తులకు నిలయంగా ఉన్న స్థలాన్ని తొలగించి, స్థానిక మహిళల రక్షణ సమస్యను పరిష్కరిస్తూనే భావి క్రీడాకారుల కోసం అంతర్జాతీయ స్థాయి వేదికను గణబాబు గారు నిర్మించారని ప్రశంసించారు.
• మహిళల ఆత్మరక్షణకు ఊతం: విద్యార్థినులు, బాలికలు కరాటే, బాక్సింగ్ వంటి విద్యలను సాధన చేయడం ఎంతో గర్వకారణమని, ఇది వారిలో ఆత్మరక్షణ నైపుణ్యాలను, సమాజంలో నిర్భయంగా తిరిగే ధైర్యాన్ని నింపుతుందని పేర్కొన్నారు.
• పేద, మధ్యతరగతి పిల్లలకు వరం: ఆర్థిక స్థోమత లేని పిల్లలు బయట హోటళ్లలో ఉండి శిక్షణ తీసుకోలేరని, ఇక్కడే ఏసీ డార్మిటరీ, 4 వుడెన్ కోర్టులతో బ్యాడ్మింటన్, బాక్సింగ్, కరాటే, కబడ్డీ వంటి క్రీడలకు అత్యుత్తమ వసతులు సమకూరాయన్నారు.
• నిర్వహణ మన బాధ్యత: కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఆధునిక ప్రాంగణం ఎల్లప్పుడూ శుభ్రంగా, పాడవకుండా ఉండేలా స్థానిక కాలనీ అసోసియేషన్, అధికారులు బాధ్యతగా పర్యవేక్షించాలని సూచించారు.
ఛాంపియన్లను తీర్చిదిద్దే సంకల్పంతోనే ట్రైనింగ్ హాల్: ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు)
• శిక్షణే ప్రథమ లక్ష్యం: ఇది కేవలం ఆటలు చూసే సాధారణ స్టేడియం మాత్రమే కాదని, చిన్న వయసు నుంచే నాణ్యమైన కోచింగ్ అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే ఛాంపియన్లను తయారుచేసే ట్రైనింగ్ కాంప్లెక్స్ అని స్పష్టం చేశారు.
• నిలిచిన పనులకు మోక్షం: 2014-19 టీడీపీ హయాంలోనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆపేసిన పనులను కూటమి ప్రభుత్వం రాగానే స్పీడప్ చేసి పూర్తి చేశామన్నారు.
• రెసిడెన్షియల్ క్యాంప్‌ల సౌకర్యం: రాష్ట్ర, జిల్లా స్థాయి జట్లకు 10-15 రోజుల పాటు ఇక్కడే శిక్షణ ఇచ్చేందుకు వీలుగా 50 నుంచి 60 మంది క్రీడాకారులు బస చేసేందుకు ప్రత్యేక డార్మిటరీ సదుపాయం కల్పించామని వివరించారు.
• క్రీడా రాజధానిగా విశాఖ: క్రీడా నేపథ్యం కలిగిన ఎంపీ శ్రీభరత్ గారి సహకారంతో విశాఖపట్నాన్ని క్రీడల హబ్‌గా, ఆంధ్రప్రదేశ్ క్రీడా రాజధానిగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, కూటమి నాయకులు, ఎంఐజీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు, కోచ్‌లు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










