అభివృద్ధిపై అప్పలరాజు వ్యాఖ్యలకు టీడీపీ వర్గం కౌంటర్!

0
3

రహదారులు, వైద్యం, విద్య, గృహ నిర్మాణంపై ప్రస్తుత ప్రభుత్వ పనుల వివరాలు వెల్లడి

పలాస: గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా పలు అంశాలతో కూడిన వివరణ వెలువడింది. రహదారులు, వైద్య సదుపాయాలు, విద్య, గృహ నిర్మాణం సహా పలాస–కాశీబుగ్గ ప్రాంతంలో చేపట్టిన పనుల వివరాలను వెల్లడిస్తూ గతంలో ప్రారంభించిన కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలాయని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

రోడ్లు, డ్రైనేజీపై ప్రత్యేక దృష్టి

గతంలో గ్రామీణ రహదారుల పరిస్థితిపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యేదని, ప్రస్తుత ప్రభుత్వం పల్లె పండుగ పథకం ద్వారా ఉపాధి హామీ నిధులతో పలు గ్రామాల్లో తారు, సీసీ రోడ్లు నిర్మించిందని వివరించారు. HAM, సుడా, ఎంపీ నిధులతో వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు. కేటీ రోడ్డు విస్తరణలో మిగిలిన గోతుల పూడ్చివేత పనులను కూడా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

కిడ్నీ ఆసుపత్రిలో అదనపు వసతులు

కిడ్నీ ఆసుపత్రి భవన నిర్మాణం గతంలో జరిగినప్పటికీ, అవసరమైన వైద్య సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని వివరణలో పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల జీతాల చెల్లింపుతోపాటు అదనపు డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు, రూ.9 కోట్ల ప్రత్యేక నిధులతో వసతుల కల్పన చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు.

విద్యా రంగంలో కొత్త కార్యక్రమాలు

కాశీబుగ్గ హైస్కూల్‌కు పీఎం శ్రీ పథకం కింద నిధులు మంజూరయ్యాయని, పలాస ప్రభుత్వ హైస్కూల్‌ను లీప్‌ పథకంలో చేర్చినట్లు వివరించారు. గతంలో పుండీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, అక్కపల్లిలో బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, పలాసలో బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుమతులు మంజూరైనట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కేంద్రీయ విద్యాలయం మంజూరై ప్రారంభమైందని, శాశ్వత భవనాల నిర్మాణం త్వరలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

గృహ నిర్మాణాలు, ఆర్‌ఓబీ పనులపై వివరణ

2014–19 మధ్య డేకురుకొండ వద్ద ఇళ్ల నిర్మాణం, సోదికొండలో 192 హడ్కో ఇళ్లు, టిట్కో పథకం కింద 2,000 ఇళ్లకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. వాటిలో మిగిలిన ఇళ్లను ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు గతంలో ప్రారంభమైనా పూర్తికాలేదని, ప్రస్తుతం నిర్వాసితులకు స్థలాల కేటాయింపు, బకాయిల చెల్లింపు, అవసరమైన నిధుల సమీకరణతో పనులు పూర్తి చేసినట్లు వివరించారు.

ముత్యాలమ్మ కోనేరు, రైతు బజార్‌పై ముందడుగు

ముత్యాలమ్మ కోనేరు అభివృద్ధికి గతంలో రూ.70 లక్షలు కేటాయించినప్పటికీ పనులు పూర్తికాలేదని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విద్యుత్ దీపాలు, జిమ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతు బజార్‌కు గతంలో భూమిపూజ జరిగినా పనులు ముందుకు సాగలేదని, ప్రస్తుతం రూ.50 లక్షలు మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు.

ఎంఐజీ లేఅవుట్‌పై విచారణ

బొడ్డపాడు ప్రాంతంలో 150 ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి గతంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ దర్యాప్తు కొనసాగుతోందని వివరణలో పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు పెరిగాయని, స్థలాల కేటాయింపు, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మద్యం విక్రయాలు, ఇతర ఆరోపణలు విచారణలో ఉన్నందున వాటిపై వ్యాఖ్యానించడం లేదని స్పష్టం చేశారు.

అభివృద్ధే ప్రధాన అంశమని వెల్లడి

గత రెండున్నరేళ్లుగా ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొంటూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారని వివరణలో పేర్కొన్నారు. పలాస ప్రాంత అభివృద్ధిపై రాజకీయ పార్టీల మధ్య సాగుతున్న చర్చ స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.