ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. తన భార్య అన్నా కొణిదెలతో 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ఇద్దరూ విడిపోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
2013 సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్, రష్యాకు చెందిన అన్నా లెజ్నెవాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
పరస్పర అంగీకారంతో నిర్ణయం!
తమ జీవితంలో ఎంతోకాలం కలిసి ప్రయాణించిన అనంతరం పరస్పర అవగాహన, గౌరవంతో విడివిడిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఈ జంట ప్రకటించింది. భార్యాభర్తల బంధం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా, పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు.
పిల్లల భవిష్యత్తే ప్రాధాన్యత!
తమ పిల్లల సంతోషం, సంక్షేమమే తమ ఇద్దరి ప్రధాన ప్రాధాన్యత అని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వ్యక్తిగత సమయంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులు, ప్రజలను కోరారు.
ఇదిలా ఉంటే..
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో ఇది మూడో వివాహ బంధం ముగింపు. అయితే విడిపోవడానికి గల కారణాలను ఈ జంట వెల్లడించలేదు. అలాగే అధికారిక విడాకుల న్యాయపరమైన ప్రక్రియ పూర్తయినట్లు కూడా సమాచారం లేదు.
13 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన ఈ నిర్ణయం రాజకీయ, సినీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.










