ప్లాట్ఫామ్ నంబర్ 5, 6 మధ్య నిలిపి ఉంచిన ఖాళీ రైలులో మంటలు.. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు.
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్లో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్లోని ప్లాట్ఫామ్ నంబర్ 5, 6 మధ్య మరమ్మతుల నిమిత్తం నిలిపి ఉంచిన ఖాళీ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కనే ఉన్న బోగీలకు వ్యాపించడంతో స్టేషన్ పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది.
అప్రమత్తమైన అధికారులు..
సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో రైలులో మంటలు గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రైల్వే పోలీసులు, సంబంధిత అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా రైల్వే సిబ్బంది చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ప్రభావిత బోగీలను ఇతర బోగీల నుంచి వేరు చేశారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి సాయంత్రం 7:15 గంటల సమయానికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రాణనష్టం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
ప్రమాదం జరిగిన సమయంలో రైలు ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.









