పలాస: పలాస మున్సిపాలిటీ పరిధిలోని చిన్నబాడాంలో పాత జాతీయ రహదారి పక్కనున్న ఓ పూరింటిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ఇంట్లో నిర్వహిస్తున్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. కాశీబుగ్గ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. దీంతో మంటలు పక్కనున్న ప్రాంతాలకు వ్యాపించకుండా అదుపులోకి వచ్చాయి.
ప్రమాదం జరిగిన సమయంలో ఈ కేంద్రంలో విగ్రహాల తయారీ కోసం రాజస్థాన్ నుంచి వచ్చిన కళాకారులు అక్కడ లేరు. దీంతో పెనుప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.










