ఘట్కేసర్లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీ చేశారు. ప్రతాపసింగారంలోని గుబ్బరిగుట్ట మైసమ్మ గుడి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు విలువైన 3 గంటలను అపహరించారు.ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి ఆధారాల సేకరణ చేపట్టారు. వరుస దొంగతనాలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు, దుకాణాలతో పాటు దేవాలయాలపై కూడా దాడులు జరుగుతున్నాయని వారు పేర్కొంటూ పోలీస్ గస్తీ పెంచాలని కోరుతున్నారు. దుండగులెవరు, ఎప్పుడు చోరీ చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజలు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.









