డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఛలో ఢిల్లీ – CITU

0
1

మంచిర్యాల జిల్లా కేంద్రం:

మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.42 వేల కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రతతో పాటు ఈపీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (CITU) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2026 డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ – పార్లమెంట్ మార్చ్ వాల్ పోస్టర్లను శనివారం మంచిర్యాల పట్టణంలోని CITU జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు.

కామ్రేడ్ ఎండి కరీంబి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో పలు కార్మిక సమస్యలపై చర్చించారు. అనంతరం ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం CITU జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దాగం రాజారాం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు ఇప్పటికీ సరైన గుర్తింపు లేదని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కోడిగుడ్ల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం వాటి ధరలను పెంచకపోవడం కార్మికులకు నష్టదాయకంగా మారిందన్నారు.

అలాగే హరే రమా హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్న అల్పాహారం నాణ్యతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

CITU జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, కోడిగుడ్లు, గ్యాస్‌ను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 1న ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి పార్లమెంట్‌కు మార్చ్ నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ వచ్చే వరకు పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాలను, పాలకులు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎండి రఫియా, జిల్లా కమిటీ సభ్యులు మధునమ్మ, సవిత, రమాదేవి, సరిత తదితరులు పాల్గొన్నారు.