ఆసిఫాబాద్, నవంబర్ 21 (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలులో నుంచి జారిపడి గుర్తుతెలియని యువతీ యువకుడు దుర్మరణం పాలయ్యారు.
వివరాల్లోకి వెళితే.. త్రివేండ్రం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న కేరళ ఎక్స్ప్రెస్ (Kerala Express) రైలు రెబ్బెన రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే, ప్రమాదవశాత్తు రైలులో నుంచి ఒక యువకుడు, యువతి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్ర గాయాలపాలై రైల్వే పట్టాల పక్కనే అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వయసు సుమారు 25 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు (GRP) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతుల వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించకపోవడంతో వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, వారి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.









