మంచిర్యాల: బాల్య వివాహాల రహిత భారతదేశం నిర్మించడమే లక్ష్యంగా ‘చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సౌజన్యంతో డ్రీమ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య ఐఏఎస్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు డ్రీమ్ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. బాల్య వివాహాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహ నిరోధక చట్టం–2006 ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలకు మద్దతు తెలిపిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.బాల్య వివాహం నిర్వహించిన వారికి లక్ష రూపాయల జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బాల్య వివాహాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన గోడపత్రికలను జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తదితర అధికారులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఏవో దేశ్‌పాండే శ్రీనివాసరావు, ఐసీడీఎస్, డీడబ్ల్యూఓ, కార్మిక శాఖ, ఆరోగ్య శాఖ, పోషణ అభియాన్, చైల్డ్ హెల్ప్‌లైన్, డీసీపీయూ, మహిళా సాధికారత శాఖ, డీఆర్డీఏ తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డ్రీమ్ సొసైటీ తరఫున సంతోష్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్లు సుజాత, నాగేష్ హాజరయ్యారు. జిల్లాలోని నెన్నెల, కన్నెపల్లి మండలాల్లో బాల్య వివాహాల నిర్మూలనకు డ్రీమ్ సొసైటీ చేస్తున్న కృషిని అధికారులు అభినందించారు.బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, బాలల హక్కులను పరిరక్షించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.










