వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్.. సరఫరా చేయాలి: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
▫️విలీన గ్రామాల్లో వేగంగా అభివృద్ధి పనులు
▫️ రైతులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి
▫️విద్యుత్, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులతో ఎమ్మెల్యేలు వేర్వేరుగా సమీక్ష
వ్యవసాయ విద్యుత్ సరఫరాతో పాటు విలీన గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులతో వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
🔸విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష:
విద్యుత్ శాఖ ఎస్ఈ రాజేశ్వర్, డీఈఈలు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ఎమ్మెల్యే చర్చించారు.
రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉన్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
విద్యుత్ అంతరాయాల వల్ల పంటలకు నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలని అన్నారు. లోడ్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రత్యేక
DTRలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
విద్యుత్ సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించి పరిష్కరించేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.అవసరమైన చోట విద్యుత్ స్తంభాల ఏర్పాటు,మరమ్మతులు తదితర విషయాల్లో అంకితభావంతో పనిచేయాలన్నారు.
🔸పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్ష:
అనంతరం పబ్లిక్ హెల్త్ శాఖ ఈఈ తిరుపతి కుమార్, డిఈఈ,ఏఈఈ అధికారులతో ఎమ్మెల్యే వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. విలీన గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన పనులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.










