• రజకుల జీవనోపాధి కోసం రూ. 19.65 లక్షలతో నూతన ‘ధోబీ ఘాట్’ ప్రారంభం
• నందమూరి నగర్ ప్రజల రాకపోకల కోసం రూ. 19.80 లక్షలతో బాక్స్ కల్వర్టు, సి.సి. రోడ్డు జాతికి ప్రారంభం
• మౌలిక సదుపాయాల కల్పనతోనే పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి: ఎమ్మెల్యే గణబాబు
విశాఖపశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజల మౌలిక అవసరాలను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) స్పష్టం చేశారు. జీవీఎంసీ సాధారణ నిధులు మొత్తం రూ. 39.45 లక్షల అంచనా వ్యయంతో 92వ వార్డులో పూర్తి చేసిన రెండు కీలక అభివృద్ధి పనులను ఆయన గురువారం ఘనంగా ప్రారంభించారు.
ప్రారంభించిన అభివృద్ధి పనుల వివరాలు:
• ధోబీ ఘాట్ నిర్మాణం (రూ. 19.65 లక్షలు):
92వ వార్డు పద్మనాభ నగర్, జనతా కాలనీ నందు రజక సోదరుల దశాబ్దాల కష్టాలను తీరుస్తూ, వారి జీవనోపాధికి వెన్నుదన్నుగా నిలిచేందుకు ఆధునిక వసతులతో కూడిన నూతన ‘ధోబీ ఘాట్’ను ప్రారంభించారు.
• బాక్స్ కల్వర్టు మరియు సి.సి. రోడ్డు (రూ. 19.80 లక్షలు):
మసీదు సమీపాన గల నందమూరి నగర్ గ్రామమును అనుసంధానిస్తూ పద్మనాభ నగర్ వరకు స్థానిక నివాసితులు, ముస్లిం సోదరుల రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తూ నూతనంగా నిర్మించిన బాక్స్ కల్వర్టు, సిమెంట్ కాంక్రీట్ (సి.సి) రోడ్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ:
“ఈ రోజు ఉదయమే పేదలకు శాశ్వత గృహవసతి కల్పిస్తూ టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలను ఘనంగా నిర్వహించి, లబ్ధిదారులకు తాళాలు అందించాం. అనంతరం సమాజంలో అత్యంత శ్రమజీవులైన రజక వర్గాల ఉపాధి కోసం ధోబీ ఘాట్‌ను ప్రారంభించుకోవడం ఎంతో తృప్తినిచ్చింది. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ రోజువారీ కష్టపడే ముస్లిం సోదరులు ఎక్కువగా నివసించే నందమూరి నగర్ ప్రాంతంలో సరైన రోడ్డు, వంతెన లేక ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడుతున్నారు. వారి కష్టాలను దృష్టిలో ఉంచుకుని పక్కా బాక్స్ కల్వర్టు, సి.సి. రోడ్డును అందుబాటులోకి తెచ్చాం.”
“పెద్ద పెద్ద నగరాల్లో భారీ రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తేనే అభివృద్ధి కాదు; క్షేత్రస్థాయిలో సామాన్యులు, పేదలు నివసించే కాలనీలు, శివారు గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించినప్పుడే అసలైన సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గంలో ఇంకా మిగిలి ఉన్న అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, కూటమి నాయకులు, స్థానిక వార్డు పెద్దలు, రజక సంఘ ప్రతినిధులు, ముస్లిం సంఘ సభ్యులు, నందమూరి నగర్ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










