మంచిర్యాల: 2030 నాటికి దేశంలో క్షయవ్యాధి (టీబీ)ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) తెలిపారు.ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి–జిల్లా పంచాయతీ అధికారి, ఎన్‌సీసీ కమాండెంట్లతో కలిసి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు టీబీపై అవగాహన కల్పించడంతో పాటు అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.వార్డు, మండల స్థాయిలో జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ బృందాలను ఏర్పాటు చేసి టీబీ లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే 15 టీబీ ముక్త్ గ్రామ పంచాయతీలను గుర్తించినట్లు వెల్లడించారు.అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది టీబీ నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. టీబీ నిర్మూలనకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు.










