● వలస కార్మికుల నియామకానికి కఠిన నిబంధనలు అవసరం
● గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలి
● నిందితుడికి త్వరితగతిన కఠిన శిక్ష పడాలి
అల్వాల్, 11 అక్టోబర్: కౌకూర్‌లోని విల్లా ఆర్కేడ్ గేటెడ్ కమ్యూనిటీలో ఐదేళ్ల చిన్నారి అరేలియా (మోను) హత్యకు గురైన ఘటనపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి నియామక ప్రక్రియలో కఠినమైన ధ్రువీకరణ విధానాలు అమలు చేయాలని, గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మీడియాతో మాట్లాడుతూ, వాచ్‌మెన్‌గా పనిచేసిన బీహార్‌కు చెందిన వ్యక్తి చిన్నారిని అపహరించి, ఆమె తాతకు ఫోన్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.
డబ్బులు ఇస్తామని చెప్పినా చిన్నారిని హత్య చేసి నీటి ట్యాంకులో పడేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు వ్యక్తి ప్రవర్తన సరిగా లేకపోవడంతో కాలనీ పాలకమండలి అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
హైదరాబాద్‌కు వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు, డ్రైవర్లు, వాచ్మెన్లుగా పనిచేయడానికి అనేకమంది వస్తున్నారని, వారిలో కొందరు కుటుంబాలకు దూరంగా ఉంటూ బ్యాచిలర్లుగా జీవిస్తున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ఉద్యోగాల్లో నియమించే ముందు వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు, వారిని తీసుకువచ్చే మ్యాన్‌పవర్ ఏజెన్సీల బాధ్యతను కూడా నిర్దేశించాలని సూచించారు. ఉద్యోగం ఇప్పించి కమిషన్ తీసుకోవడంపైనే కాకుండా, నియమించిన వ్యక్తుల ప్రవర్తనను పర్యవేక్షించడంపైనా ఏజెన్సీలు దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
మత్తు పదార్థాలకు బానిసలవుతున్న కొందరు నేరాలకు పాల్పడటం వల్ల నిజాయితీగా బతుకుదెరువు కోసం వలస వచ్చే కార్మికులపైనా ప్రతికూల ప్రభావం పడుతోందని అన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిని కాలనీల్లో ఉద్యోగాల్లో నియమించుకోవడానికి యజమానులు వెనుకాడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం స్పష్టమైన చట్టాలు, నియమనిబంధనలు తీసుకురావాలని కోరారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణ లోపించిందని విమర్శించిన ఎంపీ, రాత్రివేళల్లో మత్తు పదార్థాలు, మద్యం విచ్చలవిడిగా లభిస్తున్నాయన్నారు.
యువత మత్తుకు బానిసవుతున్న పరిస్థితిని అరికట్టాలని, పెద్దపెద్ద ఫామ్హౌస్లలోనూ డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, వాటి మూలాలను గుర్తించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ పోలీసులకు సమర్థత, నైపుణ్యం ఉన్నాయని, వారు సంకల్పిస్తే మత్తు పదార్థాల అక్రమ వినియోగాన్ని సమర్థంగా నియంత్రించగలరని ఈటల రాజేందర్ అన్నారు.
ముఖ్యమంత్రి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తారో లేదో తెలియదని వ్యాఖ్యానిస్తూ, పోలీసులు తక్షణమే స్పందించి చిన్నారి హత్య కేసులో నిందితుడికి చట్ట ప్రకారం త్వరితగతిన కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరో కుటుంబానికి ఇలాంటి విషాదం ఎదురుకాకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్ రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ధనలక్ష్మి, డివిజన్ అధ్యక్షులు నవీన్ గౌడ్, ఆదిత్య, సీనియర్ నాయకులు సుదర్శన్, సామల సత్తిరెడ్డి, యశ్వంత్, రోషన్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










