ఐసీసీ ఛైర్మన్‌గా రెండోసారి జై షా ఏకగ్రీవ ఎన్నిక|

0
3

● మరో రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న జై షా 

● పోటీ లేకుండానే రెండోసారి బాధ్యతలు

● 2027 వన్డే ప్రపంచకప్, 2028 ఒలింపిక్స్‌పై ప్రత్యేక దృష్టి

అల్వాల్, నవంబర్ 16: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా జై షా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ సోమవారం ప్రకటించింది.

ఐసీసీ డైరెక్టర్లు జై షా పేరును ప్రతిపాదించగా, ఈ పదవికి పోటీగా మరెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఆయన రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఖరారైంది. మరో రెండేళ్ల పాటు ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.

● 35 ఏళ్లకే ఐసీసీ పగ్గాలు

2024 ఆగస్టులో తొలిసారి ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన జై షా, అదే ఏడాది డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. 35 ఏళ్ల వయసులో ఈ పదవిని చేపట్టి ఐసీసీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఛైర్మన్‌గా రికార్డు సృష్టించారు. అంతకుముందు బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2009 నుంచి గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా క్రికెట్ పరిపాలనలో కొనసాగుతున్నారు. ఐసీసీకి నాయకత్వం వహించిన ఐదో భారతీయుడిగా జై షా నిలిచారు.

● ముందున్న కీలక బాధ్యతలు

రెండో పదవీకాలంలో జై షా ముందు పలు కీలక క్రీడా ఈవెంట్లు ఉన్నాయి. 2027లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌తో పాటు, 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం ఆయన పదవీకాలంలో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి.

#Sidhumaroju

Alwal