నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితుల నుంచి పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మొత్తం 43 ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను పోలీస్ కమిషనర్‌కు వివరించగా, ఆయన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి, సమస్యలను చట్టపరిధిలో న్యాయబద్ధంగా పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.









